KTR : మరికొద్ది రోజులలో ఎలక్షన్స్ జరగనుండగా, అన్ని పార్టీల నాయకులు జోరుగా ప్రచార కార్యక్రమాలు సాగుతున్నాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ప్రచార కార్యక్రమాలలో స్పీడ్ పెంచారు. సిరిసిల్ల బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మంత్రి కేటీఆర్ నామినేషన్ దాఖలు చేశారు. కేటీఆర్ సిరిసిల్ల బరిలో నిల్చోవడం ఇది ఐదవసారి. గురువారం ఉదయం సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయంలో మంత్రి కేటీఆర్ నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కరెంట్ కావాలా కాంగ్రెస్ కావాలా.. కన్నీళ్లు కావాలా నీళ్లు కావాలా.. స్కీములు కావాలా కాంగ్రెస్ స్కాములు కావాలా అని అడిగారు.
కులం మతం పేరుతో చిచ్చుపెట్టే వాళ్ళు వద్దు. ఢిల్లీ, గుజరాత్‌లకు సామతులం కావొద్దు. వేరేవాళ్లకు అధికారం ఇస్తే తెలంగాణ 50 ఏళ్లు వెనక్కి వెళ్తుంది. సిరిసిల్ల నన్ను మళ్లీ దీవిస్తుంది. సాగునీరు, తాగునీరు ఇవ్వని కాంగ్రెస్‌కు ఓటు వేయొద్దు. కేసీఆర్ గొంతు నొక్కాలని రాహుల్, మోదీ చూస్తున్నారు. ఢిల్లీ, బెంగుళూరు అనుమతులు మాకు అవసరం లేదు’’ అంటూ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే జోరుగా నామినేషన్లు కొనసాగుతున్న వేళ ఆర్మూర్ నియోజకవర్గంలో నామినేషన్ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. ఆర్మూరులో నామినేషన్ ర్యాలీ నిర్వహిస్తున్న క్రమంలో ప్రచార రథంలో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న మంత్రి కేటీఆర్ వాహనంపై నుండి ముందుకుపడ్డారు. అయితే స్వల్ప గాయాలు కావడంతో మంత్రి కేటీఆర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నట్టు అయింది.
ఆర్మూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన జీవన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కు ముందు ఆయన పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి తో పాటు మాజీ ఎంపీ సురేష్ రెడ్డి, మంత్రి కేటీఆర్ కూడా పాల్గొన్నారు. అయితే ర్యాలీ ముందుకు సాగుతున్న క్రమంలో కేటీఆర్ ప్రచార రథం డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేశాడు. దీంతో కేటీఆర్ ఒక్కసారిగా ముందుకు పడిపోయారు. పక్కనే ఉన్న మాజీ ఎంపీ సురేష్ రెడ్డి పూర్తిగా కింద పడిపోయారు. జీవన్ రెడ్డి కూడా ముందుకు పడిపోయారు. ఇక ఈ ఘటనలో మంత్రి కేటీఆర్ తో పాటు ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. విద్యుత్ తీగలు అడ్డురావడంతో వాహనానికి సడన్ బ్రేక్ వేయగా, ప్రచార రథం పైన ఉన్న రెయిలింగ్ విరిగిపోయింది. అయితే తన ఆరోగ్య పరిస్థితి పైన ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు.
Source link